Ad Code

చిట్ ఫండ్ పేరుతో రూ. 2 కోట్లకు ముంచిన భార్యాభర్తలు


హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి కాలనీలో  కాలనీ అధ్యక్షుడిగా ఉన్న సురేష్ కుమార్, అతని భార్య గత పదేళ్లుగా 'వెంకట సాయి చిట్ ఫండ్స్' నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లూ సక్రమంగానే చిట్టీల డబ్బులు చెల్లించడంతో కాలనీవాసులు వారిని గుడ్డిగా నమ్మారు. ఆ నమ్మకంతోనే సుమారు 25 మందికి పైగా బాధితులు ఒక్కొక్కరు రూ. 2.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు చిట్టీలు వేశారు. చిట్టీల గడువు ముగిసిన తర్వాత డబ్బులు అడిగితే సురేష్ కుమార్ దంపతులు వాయిదాలు వేస్తూ వచ్చారు. నమ్మకం కోసం ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇచ్చారు. అయితే వారు ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో బాధితులకు అనుమానం వచ్చి నిలదీశారు. దాంతో సురేష్ కుమార్ అసలు స్వరూపం బయటపడింది. “డబ్బులు ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితులు ఖంగుతిన్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు మీర్‌పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులు సుమారు రూ. 2 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu