Ad Code

కడప ఉక్కు కర్మాగారం ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం !


డప ఉక్కు కర్మాగారం ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో గణనీయమైన ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటి ఆధారంగా మరో ఆరు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. పుట్టపర్తి కేంద్రంగా రూ.15వేల కోట్ల పెట్టుబడితో యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఏరోస్పేస్‌ హబ్‌గా అభివృద్ధి చెంది, భవిష్యత్తులో సుమారు రూ.క్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో పాటు, పుట్టపర్తిలోనే డ్రోన్‌ సిటీకి ఈ నెల 15న శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయాలు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశానిర్దేశం చేయనున్నాయి. రాష్ట్రానికి వచ్చే భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్‌ఎంఈల ఎకోసిస్టమ్‌ ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వినూత్న ఆవిష్కరణలు, బ్రాండింగ్, పరిశోధనకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ఎంఎస్‌ఎంఈలు బలోపేతం అవుతాయన్నారు. ఉదాహరణకు, బీపీసీఎల్‌ చమురుశుద్ధి కర్మాగారం, అనకాపల్లిలోని ఆర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు కర్మాగారం అవసరాలకు అనుగుణంగా స్థానిక ఎంఎస్‌ఎంఈలను తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే, గూగుల్‌ డేటా సెంటర్‌ రాకతో ఏసీల తయారీ సంస్థ క్యారియర్‌ ఏపీకి వచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రాలకు అవసరమైన బల్క్‌ చిల్లర్లను స్థానిక సంస్థలే సరఫరా చేయాలని ఆకాంక్షించారు. అమరావతిలో క్వాంటమ్‌ సెంటర్‌ పని ప్రారంభించినప్పుడు, దానికి అవసరమైన హార్డ్‌వేర్‌ పరికరాలు ఉత్పత్తి చేసే ఎకోసిస్టమ్‌లో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడానికి భూముల లభ్యత అత్యంత కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, ప్రతి నెలా అవసరమైన భూములను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఏర్పడే అడ్డంకులను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా 'స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌' సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 22ఏ జాబితాలో ఉన్న ఏపీఐఐసీ భూములను నిషేధిత జాబితా నుంచి మినహాయించాలని సూచించారు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతను పెంచడం ద్వారా వాటిని 'పాన్‌ ఇండియా' స్థాయికి, అంతర్జాతీయ బ్రాండ్లుగా మార్చాలని సీఎం పిలుపునిచ్చారు. అరకు కాఫీ తరహా బ్రాండింగ్‌ ఏపీ ఉత్పత్తులకు రావాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం నుంచి చెప్పుకోదగ్గ బ్రాండ్లు లేవని, డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడం వల్ల నాణ్యత కొరవడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం సరిహద్దు ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చిత్తూరు జిల్లా కోసలనగరంలో 10 వేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం వినియోగించుకోవచ్చని, శ్రీసిటీ మాదిరి పెద్ద పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. దీని ద్వారా చెన్నై నుంచి భారీగా పెట్టుబడులు ఆకర్షించవచ్చన్నారు. కుప్పంలో కూడా పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుకు అవసరమైన భూములు ఉన్నాయని, బెంగళూరుకు సమీపంలో ఉండటంతో అక్కడి నుంచి పెట్టుబడులు ఆశించవచ్చని సీఎం వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu