Ad Code

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన యువకుడు : అప్పు ఇస్తానని నమ్మించి మహిళను హత్య చేసిన దుండగుడు


ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముత్తేపల్లి గ్రామానికి చెందిన చంద్రమ్మ (36) టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె, ఏలచీటీలు నడుపుతూ వడ్డీలకు డబ్బులు ఇచ్చే వ్యాపారం కూడా చేస్తోంది. అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (20) అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన సుబ్రమణ్యం, తన అవసరాల కోసం చంద్రమ్మ వద్ద సుమారు ₹2 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చంద్రమ్మ ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని సుబ్రమణ్యం పథకం వేశాడు. మార్చి 31న "నీ డబ్బులు ఇప్పిస్తాను, కొత్త నగలు కొనిస్తాను" అని నమ్మించి చంద్రమ్మను తన బైక్‌పై తీసుకెళ్లాడు. దారిలో సింగాపురం సమీపంలోని ఒక నిర్మానుష్య మామిడి తోటలోకి తీసుకెళ్లి, అక్కడ అప్పటికే వేచి ఉన్న తన స్నేహితులు ప్రసాద్, నూర్ అహ్మద్‌లతో కలిసి ఆమెపై దాడి చేశాడు. అనంతరం గొంతు నులిమి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. సాక్ష్యాల మరుగున ప్రయత్నం: హత్య అనంతరం మృతదేహాన్ని తరలించడానికి ఒక బొలెరో వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ముళ్ల పొదల్లో శవాన్ని పడేశారు. ఏమీ తెలియనట్టు గ్రామానికి తిరిగి వచ్చారు. చంద్రమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సుబ్రమణ్యంపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని చొక్కాపై ఉన్న రక్తపు మరకలను చూసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. డబ్బుల గొడవ వల్లే స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. నిందితుడు చూపిన ప్రదేశం నుండి పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ కేసులో సుబ్రమణ్యంతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu