Ad Code

ప్రతిపక్షం విజయం సాధించింది : ఎక్స్‌లో వీడియో పోస్ట్‌ చేసిన స్టాలిన్‌


పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన అనే నల్ల చట్టం'పై చేసిన పోరాటంలో ప్రతిపక్షం విజయం సాధించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026 శుక్రవారం లోక్‌సభలో ఆమోదం పొందలేదన్న విషయం తెలిసిందే. దీంతో ఇండియా బ్లాక్ ఎంపీలు, మహిళలకు స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాలు వాయిదా వేయాలని స్టాలిన్‌ సూచించారు. "2001లో చేసినట్లే ఇప్పుడు కూడా నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాలు వాయిదా వేయడానికి రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. అంతేకాకుండా, 2023లో మేము మద్దతు ఇచ్చి ఆమోదించిన మహిళల రిజర్వేషన్ చట్టాన్ని ప్రస్తుత సభ్యుల సంఖ్య ఆధారంగా ఎటువంటి షరతులు లేకుండా బీజేపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. దాని కోసం మనం పోరాడుదామని స్టాలిన్ అన్నారు. తమిళనాడు ప్రభుత్వం, దేశంలోని ప్రతిపక్ష నేతలు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని దాదాపు ఒక సంవత్సరం ముందే అంచనా వేశారని స్టాలిన్‌ తెలిపారు. అప్పటినుంచే సమన్వయంగా చర్యలు చేపట్టారని అన్నారు. ప్రతిపాదిత చట్ట ప్రతులను దహనం చేస్తూ తెలిపిన నిరసనలు సహా పలు కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచాయని తెలిపారు. ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలోలో స్టాలిన్ మాట్లాడుతూ "నేను నూతనోత్సాహంతో మీ ముందున్నాను. పునర్విభజన అనే నల్ల చట్టంపై మన పోరాటం విజయవంతమైంది. ఈ ప్రమాదాన్ని సంవత్సరం ముందే అంచనా వేసి అవసరమైన చర్యలు అప్పుడే ప్రారంభించాం. ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. నల్ల జెండా ఎగరవేశాం. నిన్న,మొన్న చట్ట ప్రతిని దహనం చేశాం. ఈ అగ్ని వ్యాపించాలని అన్నాను. అది పార్లమెంటుకు కూడా చేరింది" అని చెప్పారు. తమిళనాడు ప్రజలకు కూడా స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఈ మోసపూరిత ప్రయత‍్నానికి ఎదురు నిలిచారని అన్నారు. ''పునర్విభజన పేరిట బీజేపీకి అనుకూలంగా నల్ల చట్టం తీసుకురావాలనుకుంది. పార్లమెంటులో దీనిని ఓడించిన అందరికీ తమిళనాడు ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళల రిజర్వేషన్ పేరుతో ఈ చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ మహిళలే ముందుండి దీనిని ఓడించారు. ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి సభ్యులు ఏకమై నిలవడం వల్ల ఇది సాధ్యమైంది" అని అన్నారు. దేశాన్ని విభజించాలనే ప్రయత్నాలకు ఇది గట్టి దెబ్బ అని స్టాలిన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత పెరుగుతుందనడానికి ఇది సంకేతమని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మొదటిసారి ఓ బిల్లు ఆమోదం పొందలేదని అన్నారు. ఉత్తరాది-దక్షిణాది పేరుతో మన మధ్య విభేదాలు సృష్టించాలని చూసిన వారికి గట్టి దెబ్బ తగిలిందని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu