విశాఖపట్టణంలో ఒక పార్టీలో స్నేహితుల చేతిలో దాడికి గురైన 28 ఏళ్ల అకుమర్తి శాంతి కుమారి, విశాలాక్షి నగర్‌లోని ఒక హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సాయి కిరణ్ అనే యువకుడితో తనకు సంబంధం వుందని ఎందుకు ప్రచారం చేస్తున్నారని శాంతి కుమారి ప్రశ్నించడంతో ఆమెపై దాడి జరిగిందనీ, ఫలితంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అరెస్ట్ అయిన వారిని పుచ్చ సాయి కిరణ్ (24), రంపా లక్ష్మి (20), గోపాసన వెంకట సాయి జయశ్వంత్ (23), వాసుపల్లి సాయి కుమార్ (24), నరవ సాయి కుమార్ (25)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాయి కిరణ్, సాయి కుమార్, జయశ్వంత్ మంగళవారం నగరంలోని విశాలాక్షి నగర్ సమీపంలో ఉన్న బి-స్క్వేర్ హోటల్‌లో చెక్-ఇన్ అయ్యారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు లక్ష్మీ సంజన, పుచ్చ సాయి కిరణ్, పుదిరెడ్ల మణి, ఎ. శాంతి కుమారి హోటల్‌కు వచ్చి 118వ నంబరు గదిలో బస చేశారు. అక్కడ వారందరూ మద్యం సేవించే క్రమంలో సాయి కిరణ్‌తో తనకు సంబంధం ఉందని పుకార్లు వ్యాపింపజేస్తున్నారంటూ లక్ష్మీ సంజనను శాంతి కుమారి ప్రశ్నించింది. లక్ష్మీ సంజన దానిని ఖండించడంతో, వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత, సాయి కిరణ్, లక్ష్మీ సంజన, జయశ్వంత్ విచక్షణారహితంగా శాంతిపై దాడి చేయగా, మిగిలిన వారు ఆమెను దూషించారు. సాయి కుమార్, బి మణి హోటల్ నుండి వెళ్లిపోగా, మిగిలిన వారు హోటల్‌లోని 119వ నంబర్ గదికి వెళ్లారు. కొంతసేపటి తర్వాత సాయి కిరణ్ మంచినీళ్లు తీసుకురావడానికి బయటకు వెళ్లి, 118వ నంబర్ గదిలో ఉన్న శాంతి వద్దకు వెళ్లాడు. స్నేహితుల దాడితో మనస్తాపం చెందినట్లుగా కనిపించిన శాంతి, తలుపును లోపలి నుండి గడియపెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. శాంతి స్నేహితులు తలుపు పగలగొట్టి చూడగా, శాంతి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. బుధవారం తెల్లవారుజామున ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ ప్రాంగణంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఘటన మొత్తం ధృవీకరించబడిందని, బాధితురాలి స్నేహితులు శారీరక దాడి, మాటలతో దూషించడం, అవమానించడం వంటి చర్యలు ప్రాథమికంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. శాంతి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఆరుగురిని అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
0 Comments