ముంబైలో కూడా లండన్, దుబాయ్‌ల తరహాలో త్వరలో పాడ్ టాక్సీలు ప్రారంభం కానున్నాయి. మొదటి పాడ్ టాక్సీ ప్రాజెక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దీనిని నగరంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నారు. దీనిని భవిష్యత్ రవాణా వ్యవస్థగా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పనులు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రారంభమవుతాయి. పాడ్ టాక్సీలు అనేవి పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ లేదా ఆటోమేటెడ్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్. ఈ చిన్న వాహనాలకు డ్రైవర్ ఉండడు. పాడ్ టాక్సీలను తక్కువ దూరాల కోసం రూపొందించారు. చిన్న ప్రయాణాలకు ఇవి ఉత్తమమైన ఎంపిక. రైళ్లు లేదా మెట్రోల లాగా పాడ్ టాక్సీలు కూడా నిర్దిష్ట ట్రాక్‌లపై నడుస్తాయి. బస్సులు, రైళ్ల లాగా పాడ్ టాక్సీలు కూడా అనేక స్టాప్‌ల వద్ద ఆగుతాయి. పాడ్ టాక్సీలు సాధారణంగా భూమికి 5 నుండి 10 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయి. ది హిందూ పత్రిక నివేదిక ప్రకారం, ట్రాఫిక్ రద్దీ ఒక ప్రధాన సమస్యగా ఉన్న ముంబై వంటి రద్దీ నగరంలో పాడ్ టాక్సీలు ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి. ఆటోలు, బస్సులపై ఆధారపడటం చాలా వరకు తగ్గుతుంది. ప్రారంభంలో ఈ పాడ్ టాక్సీ 3.36 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది కుర్లా నుండి బాంద్రా ఈస్ట్ వరకు నడుస్తుంది. రెండవ దశలో పాడ్ టాక్సీలు 8.85 కిలోమీటర్ల వరకు దూరాన్ని కవర్ చేస్తూ, 22 స్టేషన్లలో పనిచేస్తాయి. ఈ ప్రాజెక్టుకు 1017 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. పాడ్ టాక్సీలు బ్యాటరీతో నడిచేవిగా, ఏఐ ద్వారా పనిచేసేవిగా ఉంటాయి. ప్రతి పాడ్‌లో 6 సీట్లు ఉంటాయి. ఈ పాడ్ టాక్సీ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతి 15 సెకన్లకు నడుస్తాయి. ప్రయాణికులు ఎంచుకున్న స్టేషన్ వద్ద పాడ్ టాక్సీ ఆగుతుంది.
0 Comments