2026 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఈకో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ కాలంలో ఏకంగా 1,39,769 యూనిట్ల ఈకో వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే సుమారు 3 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం వాణిజ్య అవసరాలకే కాకుండా, పెద్ద కుటుంబాలు కూడా ఈ వాహనాన్ని ఎంపిక చేసుకోవడం దీనికున్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఈకో వాహనం ఇంతటి ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం దాని సరసమైన ధర. ప్రస్తుతం మార్కెట్లో 7-సీటర్ వాహనాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేని విధంగా పెరుగుతున్న తరుణంలో, ఈకో మాత్రం రూ.5.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే లభిస్తోంది. టాప్ వేరియంట్ ధర సుమారు రూ.6.36 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర పరిధిలో ఇంతటి సీటింగ్ సామర్థ్యం కలిగిన మరో వాహనం మార్కెట్లో లేదనే చెప్పాలి. ఇందులో అమర్చిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 80 బిహెచ్‌పి శక్తిని అందిస్తూనే, లీటరుకు 19.7 కి.మీ మైలేజీని ఇస్తుంది. మరీ ముఖ్యంగా, సీఎన్‌జీ వేరియంట్ వినియోగదారులకు మరింత లాభదాయకంగా మారింది. ఇది కిలో సీఎన్‌జీకి సుమారు 26.8 కి.మీ వరకు మైలేజీని అందిస్తూ, సామాన్యుడి ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది. ఈ వాహనం కేవలం ప్రయాణాలకే కాకుండా, చిన్న వ్యాపారాలకు కూడా ఎంతో అనుకూలం. దీని 'బాక్స్' తరహా డిజైన్ వల్ల లోపలి భాగంలో స్థలం గరిష్టంగా వినియోగించుకోవచ్చు. స్లైడింగ్ డోర్స్ ఉండటం వల్ల ఇరుకైన ప్రదేశాల్లో కూడా ప్రయాణికులు సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలవుతుంది. ఈ వాహనం 5-సీటర్, 6-సీటర్, 7-సీటర్ వంటి వివిధ రకాల్లో లభిస్తుండటంతో, వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టుగా ఎంచుకోవచ్చు.
0 Comments