ముంబాయి - బెంగళూరు మధ్య రెండో వందే భారత్ స్లీపర్ ను ప్రకటించారు. ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ స్లీపర్ ఏర్పాటు చేయాలని బెంగళూరు సెంట్రల్ ఎంపీ మోహన్‌కు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లేఖ రాశారు. ప్రస్తుతం ముంబై-బెంగళూరు మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల ప్రయాణానికి 22 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రాకతో 16 గంటలకు సమయం తగ్గనుంది. అదే విధంగా ప్రస్తుతం ముంబాయి నుంచి ప్రధాన రైళ్లు బెంగళూరు కు కొనసాగుతున్న మార్గంలోనే ఈ రైలు నడవనుంది. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగనుంది. కాగా, ఈ రైలుకు అనంతపురం, హిందూపూర్ లో హాల్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. ఈ రైలుకు సంబంధించి షెడ్యూల్, టికెట్ ధరలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వచ్చే నెల అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత ఈ రైలు పట్టాలెక్కనుంది. అదే విధంగా మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. అటు కొత్తగా ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, అమృత్ భారత్ ఏసీ కోచ్ లను ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలును విశాఖ నుంచి తిరుపతి, లేదా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వందేభారత్ స్లీపర్ తో పాటుగా అమృత్ భారత్ రైలు పైన ప్రకటన రానుంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ మధ్య నడుస్తున్న వందే భారత్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో.. రైల్వే మంత్రి చేసిన ప్రకటనతో బెంగళూరు కు వెళ్లే ప్రయాణీకులకు మరింత వెసులు బాటు కలగనుంది.
0 Comments