ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాష్ట్ర భద్రతనమమతా బెనర్జీ ఫణంగా పెడుతున్నారు !


శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూచ్ బిహార్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తూ  చొరబాటుదారులకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు తెలుపుతోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర భద్రతను పణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, టీఎంసీ నాయకులు బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన తీసుకురావడానికి ప్రజలంతా బీజేపీకి అండగా నిలవాలని ఆయన కోరారు. బెంగాల్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని శాశ్వతంగా సాగనంపే సమయం ఆసన్నమైందని ప్రధాని మోడీ ప్రజలకు స్పష్టం చేశారు. టీఎంసీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను కనీసం లెక్కచేయడం లేదని ప్రధాని మోడీ మండిపడ్డారు. మాల్డాలో రెండు మూడు రోజుల క్రితం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. స్వయంగా న్యాయమూర్తులను, న్యాయాధికారులను కొందరు వ్యక్తులు బందీలుగా పట్టుకోవడం దేశవ్యాప్తంగా ఉన్న పౌరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ వ్యవస్థపైనా ఈ ప్రభుత్వానికి కనీస గౌరవం లేదని, ఇది అత్యంత దారుణమైన పాలన అని మోడీ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికే రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఎలా భద్రత ఉంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. మాల్డాలో జరిగిన దాడి కేవలం ఒక అహంకార పూరిత చర్య మాత్రమే కాదని, ఇది పూర్తిగా టీఎంసీ ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న జంగిల్ రాజ్ అని మోడీ దుయ్యబట్టారు. న్యాయస్థానాలు, రాజ్యాంగ ప్రక్రియలు కూడా సురక్షితంగా లేని ఇలాంటి వ్యవస్థను ఏమాత్రం సహించకూడదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, గుండాలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారని ఆరోపించారు. టీఎంసీ అరాచకాల వల్ల బెంగాల్‌లో సాధారణ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కరువైందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూచ్ బిహార్‌లోని రాస్ మేలా మైదానంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో 2019, 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన తర్వాత మోడీ పాల్గొన్న తొలి సభ కావడంతో దీనికి ఎంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, అధికార పార్టీ దురాగతాలకు ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.


Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం