పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్ వైపు పాకిస్తాన్ కన్నెత్తి చూసినా లేదా భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించాలని ప్రయత్నించినా, ఆ దేశం మరిన్ని ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడిన చారిత్రక ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో ప్రధానంగా పాకిస్తాన్ ఉగ్రవాద విధానాలను తప్పుబట్టారు. భారతదేశం ఎప్పుడూ పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటుందని, అయితే మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. గతంలో పాకిస్తాన్ ఒకసారి విభజనకు గురైంది, ఒకవేళ వారు తమ పద్ధతి మార్చుకోకుండా బెంగాల్‌ను లేదా భారత దేశంలోని ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే, వారు మళ్లీ అంతర్గత విభజనలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కేవలం మాటలు మాత్రమే కాదని, భారత సైన్యం ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఆయన పంపారు. ఈ సందర్భంగా ఆయన పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్‌లో చొరబాట్లు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ సరిహద్దులను పటిష్టం చేసిందని, ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా అణచివేయడానికి కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ అది ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, అక్కడి ప్రజలే త్వరలో భారత్‌లో చేరాలని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
0 Comments