ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల ప్రగతిపై ప్రాజెక్ట్ మీటింగ్ హాలులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, అధికా రులు, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో గవర్నర్ సమీక్షించారు. ఈ సందర్భంగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ బహుకార్ధసాధక ప్రాజెక్ట్ ఐన పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వరప్రదాయిని అని, ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఈరోజే పూర్తి అయ్యాయన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో ఉన్నారన్నారు. ఏటా 3 వేల టిఎంసిలకు పైగా గోదావరి వరదనీరు సముద్రంలోకి వృధాగా పోతుందన్నారు. 322. 73 టిఎంసిల నీటి వినియోగం, 194.6 టిఎంసి ల నీటి నిల్వ సామర్థంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాలలోని 28. 5 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు, 80 టిఎంసి లు నీటి మళ్లించడం, 940 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు, 23. 44 టిఎంసి లు పరిశ్రమలకు నీటిని అందించడం జరుగుతుందన్నారు.
0 Comments