Ad Code

ఆంధ్రప్రదేశ్ లోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు : విశాఖ 120కు, విజయవాడ 86కు, గుంటూరు 76కు పెంపు


ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అందుకు తగ్గినట్లుగా మార్పులు చేర్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 నగర పాలక సంస్థల్లో డివిజన్ల సంఖ్యను పెంచుతూ ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా పలు నగర పాలక సంస్థలు ఉన్నాయి. ఈ పెంపు ఆధారంగానే రేపు ఆయా కార్పోరేషన్లలో ఎన్నికలు జరుగుతాయి. డివిజన్ల సంఖ్య పెంచిన మున్సిపల్ కార్పోరేషన్లలో గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ), విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, చిత్తూరు, మచిలీపట్నం ఉన్నాయి. వీటిలో జీవీఎంసీలో ప్రస్తుతం ఉన్న 98 డివిజన్లను 120కు పెంచారు. అలాగే విజయవాడ కార్పోరేషన్లో 64 డివిజన్లను 86కు పెంచారు. గుంటూరులో 57 డివిజన్లను 76కు పెంచారు. నెల్లూరులో 54 డివిజన్లను 72కు పెంచారు. కర్నూలు కార్పోరేషన్ లో డివిజన్లను 52 నుంచి 68కి పెంచారు. తిరుపతి కార్పోరేషన్లో 50 నుంచి 66కు పెంచారు. కడపలోనూ 50 నుంచి 66కు పెంచారు. ఏలూరులో 50 నుంచి 62కు పెంచారు. అనంతపురం, ఒంగోలు, విజయనగరంలోనూ ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ల నుంచి 62కు పెంచారు. చిత్తూరు, మచిలీపట్నం కార్పోరేషన్లలో డివిజన్లను 50 నుంచి 60కి పెంచారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వం అధికారిక గెజిట్ కూడా జారీ చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu