నూతన దంపతులు విజయ్ దేవరకొండ - రష్మిక వివాహానంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ దర్శనం అనంతరం అభిమానులకు స్వీట్లను అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. 'విరోష్' జోడీ వస్తున్నారనే సమాచారం ముందుగానే వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆలయానికి తరలివచ్చారు. భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ స్వీట్లు అందుకోవాలనే ఆత్రుతతో అభిమానులు ముందుకు దూసుకెళ్లారు. పరిస్థితిని గమనించిన ఈ జంట కొందరికి స్వీట్లు అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించాయి. ఉదయ్‌పూర్‌లో ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు పలు దేవాలయాల్లో అన్నదానం నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించింది. "మా ప్రయాణంలో మీరు అందరూ భాగమే. మా పెళ్లి వేడుకలను మీతో కలిసి జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది" అని అభిమానులను ఉద్దేశించి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ చేపట్టడంతో పాటు ప్రసిద్ధ దేవాలయాల్లో అన్నదానం నిర్వహించారు. వివాహ వేడుకల అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట త్వరలో నిర్వహించనున్న స్వాగత వేడుకకు సినీ ప్రముఖులు, ఆత్మీయులు హాజరుకానున్నారు.
0 Comments