ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలోని తమ్మయ్య చెరువులో దూకి కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పెద్దగొట్టిపల్లి గ్రామానికి చెందిన నెల్లి భాగ్యలక్ష్మి (35), ఆమె కుమారుడు సాయి ఇషాన్ (3)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం భాగ్యలక్ష్మికి తన అత్తింటి వారితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా భర్త, అత్తింటి వారితో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి, తన భర్తపై ఉన్న కోపంతో ఆవేశంగా పసివాడిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. రాత్రంతా ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు మంగళవారం ఉదయం కాకరపల్లిలోని తమ్మయ్య చెరువులో రెండు మృతదేహాలు తేలుతూ కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో మృతదేహాలు ఉన్నాయన్న వార్త తెలియగానే కోటనందూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీయగా, అవి భాగ్యలక్ష్మి, ఆమె కుమారుడు సాయి ఇషాన్‌విగా నిర్ధారణ అయ్యింది. తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని నీటిలో దూకి ప్రాణాలు వదిలిన దృశ్యం చూసి అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. భాగ్యలక్ష్మి పుట్టింటి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటనందూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తింటి వేధింపుల వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
0 Comments