ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్ రాంపూర్ జిల్లాకు చెందిన రింజిమ్(18)ను గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇటీవల హోలీ సందర్భంగా రింజిమ్ తన తల్లిగారి ఇంటికి వెళ్లింది. పండుగ ముగిసిన తరువాత ప్రీతమ్ తన భార్య రింజిమ్‌ను తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు అత్తగారింటికి వెళ్లాడు. మార్చి 9న అత్తగారింటికి వెళ్లిన ప్రీతమ్ తన భార్యను తీసుకుని బస్టాండ్‌కు వచ్చాడు. ఇద్దరూ బిలారి బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో రింజిమ్ తనకు ఆకలిగా ఉందని, తినడానికి పకోడీ తీసుకురమ్మని భర్తను కోరింది. దీంతో అతను పకోడీ కొనితెచ్చేందుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రింజిమ్ బస్టాండ్ నుంచి పరారైంది. పకోడీ తీసుకుని బస్టాండ్‌లోకి వచ్చిన ప్రీతమ్ కు అక్కడ రింజిమ్ కనిపించలేదు. బస్టాండ్ పరిసరాలన్నీ వెతికాడు. కానీ, ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తన భార్య ఓ యువకుడితో వెళ్లిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. ప్రీతమ్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేశారు. ఆమె కదలికలను ట్రాక్ చేయడానికి ఆమె మొబైల్ లొకేషన్‌ను కూడా ట్రేస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆచూకీ లభించలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
0 Comments