ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి హెచ్.జే. దొర (83) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం హెచ్‌జే దొర ఈరోజు ఉదయం డయాలసిస్ చేయించుకోవడానికి నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన, బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను మళ్లీ నిమ్స్‌కు తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. 1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన హెచ్.జే. దొర, 1965 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. తన సుదీర్ఘ సర్వీసులో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments