జమ్మూ కాశ్మీర్‌లో కురుస్తున్న తాజా మంచు కారణంగా మంగళవారం జనజీవనం స్తంభించిపోయింది. గందర్‌బాల్ జిల్లా సోనామార్గ్ సమీపంలోని సర్బాల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ హిమపాతం సంభవించింది. పర్వతం పైనుండి విరుచుకుపడిన మంచు ఒక్కసారిగా ఇళ్లు, వాహనాలను ముంచెత్తింది. ఈ ఘటన తీవ్రత భారీగా ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు ధృవీకరించారు. మంగళవారం రాత్రి 10:12 గంటలకు ఈ హిమపాతం సంభవించింది. పర్వతం పైనుండి భారీ ఎత్తున మంచు కిందికి దూసుకురావడంతో సమీపంలోని ఇళ్లు, హోటళ్లు మంచులో కూరుకుపోయాయి. ఈ భయంకర దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మంచు తుపాను భవనాలను కమ్మేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోయ అంతటా నిరంతరంగా కురుస్తున్న మంచు కారణంగా సోమవారమే అధికారులు ఈ ప్రాంతంలో భారీ హిమపాతం సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దీనివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. మంచు పేరుకుపోవడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ముఖ్యంగా ఖాజీగుండ్ మరియు బనిహాల్ వద్ద ఉన్న నవ్యుగ్ టన్నెల్ సమీపంలో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై మంచు పేరుకుపోవడంతో షెడ్యూల్ చేసిన మొత్తం 58 విమానాలను రద్దు చేశారు. దీంతో వందలాది మంది పర్యాటకులు లోయలో చిక్కుకుపోయారు.
0 Comments