Ad Code

భాగ్యలక్ష్మి మైనింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మేనల్లుడు దోపిడీ !


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని మానస హిల్స్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను తవ్వుతూ మైనింగ్ చేస్తున్నారని  బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అయితే దీనిపై ప్రశ్నించగా మంత్రి పొంగులేటి రాత్రికి రాత్రే పేరు మార్చి తమకు సంబంధం లేదని చెబుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో వెలుగుమట్ల పేద ప్రజలను "పెయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియా" అంటూ అభివర్ణించడం సరైంది కాదన్నారు. "భాగ్యలక్ష్మి మైనింగ్" పేరుతో సీఎం మేనల్లుడు రమేష్ రెడ్డికి నామినేషన్ పద్ధతిలో అనుమతులు ఇచ్చి వనరులను దోచుకుంటున్నారని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరం లేదని చెప్పినా వినకుండా ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చేస్తోందని ఆరోపించారు. వెలుగుమట్ల పరిస్థితి గాజాను తలపించేలా మారుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే రేపు తెలంగాణ మొత్తం గాజా అవుతుందని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లను కూల్చుతున్నారని, అయితే అక్రమ నిర్మాణాలు మాత్రం అధికారులకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, కేవలం 500 మీటర్ల దూరంలోనే తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.


Post a Comment

0 Comments

Close Menu