తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ అధినేత విజయ్‌కు ముఖ్యమంత్రి పదవితో పాటు 50 శాతం అసెంబ్లీ సీట్లను ఇస్తామని ఓ రాజకీయ పార్టీ ఆఫర్ చేసిందని టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్ ప్రకటించారు. అయితే ఆ ప్రతిపాదనను విజయ్ తిరస్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం టీవీకేతో చర్చలు జరుపుతున్న బీజేపీయే ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కు రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి, 50:50 నిష్పత్తిలో సీట్లు ఇస్తామని సదరు పార్టీ ముందుకు వచ్చిందని అర్జున్ తెలిపారు. పొత్తు చర్చలు జరిపిన ఆ పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు తమ పార్టీ టీవీకేతో ఎలాంటి పొత్తు చర్చలు జరపడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి వెల్లడించారు. దీన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా సమర్ధించారు. అధికార డీఎంకేను ఎదుర్కొనేందుకు బీజేపీ- టీవీకేతో పొత్తుకు ప్రయత్నించినట్లు ఊహాగానాల వేళ ఈ వ్యాఖ్యలు బయటికొచ్చాయి. నిన్న రాత్రి కొలత్తూర్‌లో జరిగిన టీవీకే సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ, "విజయ్ ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీకి లొంగిపోయే వ్యక్తి కాదని, తమకు 50 నుంచి 90 సీట్ల వరకు అన్ని రకాల ఆఫర్లు వచ్చాయని తెలిపారు. విజయ్ కోరుకున్నదల్లా ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే అన్నారు. టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, అన్ని 234 నియోజకవర్గాల్లో పోటీ చేసి లౌకిక సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ సందేశాన్ని తన క్రిస్టియన్, ముస్లిం స్నేహితులకు తెలియజేయాలనుకుంటున్నట్లు అర్జున్ పేర్కొన్నారు.
0 Comments