పశ్చిమ ఇరాక్‌లో అమెరికా మిలిటరీ ఇంధన సరఫరా విమానం కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణనష్టంపై స్పష్టత రావాల్సి ఉందని యుఎస్ సెంట్రల్ కమాండ్ గురువారం వెల్లడించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ నివేదిక ప్రకారం, ఆపరేషన్‌లో ఉన్న రెండు కేసీ -135 విమానాలు ప్రమాదానికి గురవగా, అందులో ఒకటి సురక్షితంగా ల్యాండ్ అయింది. రెండో విమానం మాత్రం ఇరాక్ భూభాగంలో కుప్పకూలింది. ఇది శత్రువుల దాడి లేదా స్నేహపూర్వక కాల్పుల వల్ల జరిగిన ప్రమాదం కాదని సైన్యం స్పష్టం చేసింది. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా కోల్పోయిన నాల్గవ విమానం ఇది. గత వారం కువైట్ దళాల పొరపాటు కాల్పుల కారణంగా మూడు అమెరికన్ ఫైటర్ జెట్‌లు కూలిపోయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడుగురు అమెరికా సైనికులు మరణించగా, 140 మందికి పైగా గాయపడ్డారు. కువైట్ ఓడరేవుపై ఇరాన్ డ్రోన్ దాడి మరియు సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై జరిగిన దాడుల్లో ఈ మరణాలు సంభవించాయి. మరణించిన సైనికుల కుటుంబాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మరియు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ నివాళులర్పించారు. యుద్ధం ఇంకా ముగియలేదని, భవిష్యత్తులో మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. కూలిపోయిన కేసీ -135 ట్యాంకర్ సుమారు 60 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన విమాన నమూనా. సాధారణంగా ముగ్గురు సిబ్బంది ఉండాల్సిన ఈ విమానంలో ఐదుగురు ఎందుకు ఉన్నారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం నిరీక్షించాలని, సిబ్బంది కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సెంట్రల్ కమాండ్ తెలిపింది.
0 Comments