హైదరాబాద్ లోని జలగం వెంగళరావు పార్క్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూనే, అదనపు డబ్బు కోసం ఫ్రీ టైంలో ర్యాపిడో రైడ్లు నడుపుతున్న ఒక వ్యక్తితో పాటు, అతని బైక్ ఎక్కిన మరో యువకుడు ఈ ప్రమాదంలో మరణించారు. ఉదయం సమయంలో వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై తమ గమ్యస్థానానికి వెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఒక భారీ వాటర్ ట్యాంకర్ వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర వేగంతో రోడ్డుపై ఎగిరి పడిపోయిన వారిద్దరికీ బలమైన గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడిన ఆ ఇద్దరూ వైద్య సహాయం అందేలోపే అక్కడికక్కడే కన్నుమూశారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ దారుణానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
0 Comments