బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన సెలబ్రిటీ ఉమెన్ క్రికెట్ కు హాజరైన కన్నడ బుల్లితెర నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె వాష్ రూమ్ లో ఓ వ్యక్తి సీక్రెట్ కెమెరాను పెట్టి వీడియోలను రికార్డు చేశాడు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ వీడియోలను చూపించి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడు ఆ వీడియోలను ఆ నటి ఫ్రెండ్ ఇన్ స్టా ఖాతాకు పంపించాడు. అది నటి అకౌంట్ అని భావించి బెదిరింపులకు దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను వైరల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 సీతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇన్ స్టా ఖాతా ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు.
0 Comments