ఆంధ్రప్రదేశ్ లోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. సింగపూర్, బోస్టన్, షాంఘై వంటి అంతర్జాతీయ క్వాంటం కేంద్రాల సరసన అమరావతిని నిలపాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ అమరావతికి రానుంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాల్లో అత్యాధునిక పరిశోధనలకు ఈ వ్యాలీ కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది యువతకు నైపుణ్య శిక్షణతో పాటు, భారీ ఎత్తున గ్లోబల్ టెక్నాలజీ పెట్టుబడులు, స్టార్టప్ ఎకో సిస్టం విస్తరణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రానున్న ఆగస్టు నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, డిసెంబరు కల్లా క్వాంటం కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments