Ad Code

హైదరాబాద్‌లో యాపిల్ అధికారిక స్టోర్ : వెలువడిన ఉద్యోగుల నియామక ప్రకటన


ముంబయి, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో అధికారిక స్టోర్లు ప్రారంభించిన యాపిల్ ఇప్పుడు హైదరాబాద్‌ను తన తదుపరి గమ్యంగా ఎంచుకుంది. దేశీయంగా సొంత రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేసే వ్యూహంలో భాగంగా హైదరాబాద్‌లో తొలి అధికారిక యాపిల్ స్టోర్ ప్రారంభానికి సంస్థ సన్నాహాలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన సంకేతంగా ఉద్యోగుల నియామక ప్రకటనలు ఇప్పటికే వెలువడ్డాయి. యాపిల్ కెరీర్ పోర్టల్‌లో తాజాగా విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా హైదరాబాద్ స్టోర్ కోసం విస్తృత స్థాయిలో నియామకాలు చేపట్టనున్నట్టు స్పష్టమైంది. అవుట్‌లెట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, స్టోర్ లీడర్, రిటైల్ మేనేజర్ వంటి కీలక నిర్వహణ పోస్టులతో పాటు టెక్నికల్ స్పెషలిస్ట్, బిజినెస్ ఎక్స్‌పర్ట్స్, ఆపరేషన్స్ ఎక్స్‌పర్ట్స్ పోస్టులకూ అవకాశాలు కల్పిస్తోంది. పూర్తి కాలం, పార్ట్‌టైమ్, కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలకూ యాపిల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో యాపిల్ రిటైల్ విస్తరణ గణనీయంగా పెరిగింది. 2023లో యాపిల్ బీకేసీ పేరుతో ముంబయిలో తొలి స్టోర్ ప్రారంభమైంది. అదే ఏడాది యాపిల్ సాకేత్ పేరుతో ఢిల్లీలో రెండో స్టోర్ తెరుచుకుంది. గతేడాది బెంగళూరు, పుణె, నోయిడా వంటి నగరాల్లోనూ యాపిల్ తన ఉనికిని విస్తరించింది. ఈ క్రమంలో హైదరాబాద్ ఎంపిక కావడం నగరానికి ఉన్న ఐటీ ప్రాధాన్యతను మరింత స్పష్టం చేస్తోంది. హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్ ప్రారంభం నగర టెక్ ప్రియులకు ఒక శుభవార్తగా మారింది. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో యాపిల్ తన మూడో ప్రధాన మెట్రో రిటైల్ సిటీగా అడుగుపెట్టడం ప్రాధాన్యత కలిగిన పరిణామంగా భావిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనలు రావడంతో ఈ వార్తపై స్పష్టత వచ్చింది. హైదరాబాద్ స్టోర్ కోసం యాపిల్ దాదాపు పది కంటే ఎక్కువ విభాగాల్లో నియామకాలు చేపడుతోంది. స్టోర్ లీడర్, మేనేజర్ పోస్టులు స్టోర్ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తాయి. జీనియస్ పోస్టులు సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతాయి. స్పెషలిస్ట్, క్రియేటివ్ విభాగాల్లో పనిచేసేవారు వినియోగదారులకు ఉత్పత్తుల వివరాలు తెలియజేసి విక్రయాలను పెంచే బాధ్యత వహిస్తారు. ఆపరేషన్స్ ఎక్స్‌పర్ట్స్ స్టోర్ నిర్వహణ, ఇన్వెంటరీ వంటి అంశాలను చూసుకుంటారు. ఈ స్టోర్ ద్వారా సుమారు 100 నుంచి 150 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా.

Post a Comment

0 Comments

Close Menu