పంజాబ్ లోని జలంధర్ మోడల్ టౌన్ సమీపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ ను దుండగులు కాల్చి చంపారు. ముఖం కనబడకుండా మాస్క్ పెట్టుకుని, హుడీ కప్పుకుని వచ్చిన నిందితుడు ఒబెరాయ్ వాహనం వద్దకు వచ్చి లోపల ఉన్న ఆయనపై కాల్పులు జరిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒబెరాయ్‌కు అత్యంత సమీపం నుంచి నిందితుడు పలు రౌండ్ల కాల్పులు జరిపి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన మహీంద్రా థార్ రాక్స్ కారులో కూర్చున్న సమయంలో లక్కీ ఒబెరాయ్ హత్యకు గురయ్యారు. ఈ కాల్పులకు కారు అద్దాలు పగిలిపోయాయి. పక్కనే ఉన్న మరో వాహనం అద్దాలు కూడా దెబ్బతిన్నాయి. కాల్పుల్లో కుప్పకూలిన ఒబెరాయ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, తీవ్రగాయాలు కావడంతో ఆయన కన్నుమూశారు. ఈ ఘటనపై పంజాబ్‌లో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను పరిరక్షించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ ఉదంతం తెలియజేస్తోందని అసెంబ్లీ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆగ్రహం వ్యక్తం చేశారు.
0 Comments