ఉత్తరప్రదేశ్లోని హర్దోయీకి చెందిన ఒక మహిళ, తన భర్త, అత్తమామల మరణం తర్వాత వారి ఇంట్లోనే నివసిస్తోంది. ఆ ఆస్తిపై కన్నేసిన భర్త మేనమామ వినోద్ శ్రీవాస్తవ, ఫోర్జరీ పత్రాలతో ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడు. దీనిపై సదరు మహిళ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ తన కుమార్తెతో కలిసి ఇంటికి వస్తుండగా వినోద్ మరియు అతని కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకున్నారు. కేసు వెనక్కి తీసుకుని, రూ. ఆరు లక్షలు తీసుకుని ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు. ఆమె నిరాకరించడంతో కర్రలు, బెల్టులు, కత్తులతో దాడికి తెగబడ్డారు. దాడి సమయంలో వారు తమ పెంపుడు కుక్కను ఐదేళ్ల చిన్నారి పైకి వదిలారు. కుక్క కరవడంతో చిన్నారి తీవ్రంగా గాయపడి ఏడ్చింది. కానీ, తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి ఆ చిన్నారి ఏ మాత్రం భయపడకుండా ఆ నొప్పిని భరిస్తూనే సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు ఒంటరిగా పరుగెత్తింది. స్టేషన్‌లో ఉన్న పోలీసులతో ''మా అమ్మను కొడుతున్నారు, నన్ను కూడా కుక్క కరిచింది, దయచేసి వచ్చి కాపాడండి" అని ఏడుస్తూ వేడుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చిన్నారి ధైర్యం వల్లనే తన ప్రాణాలు దక్కాయని ఆ తల్లి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.
0 Comments