గూగుల్ డేటా సెంటర్ కోసం గతంలో రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 480 ఎకరాల భూమిని 600 ఎకరాలకు పెంచుతూ మొత్తం 601.4 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం ఇచ్చినట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తెలిపారు. ఈ భూమిని అదానీ ఇన్ఫ్రా (ఇండియా) లిమిటెడ్ కు అనుకూలంగా కేటాయించామని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూ కేటాయింపు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సవరించిన కేటాయింపుల ప్రకారం..తర్లువాడ (విశాఖపట్నం - అనకాపల్లి జిల్లాలు) వద్ద 266.6 ఎకరాలు, అడవివరం - ముడసర్లోవ ప్రాంతాల్లో 160 ఎకరాలు, రాంబిల్లి వద్ద 175 ఎకరాలు కేటాయించనున్నారు. ఇంతకుముందు రాంబిల్లి వద్ద 160 ఎకరాలు, అడవివరం-ముడసర్లోవ వద్ద 200 ఎకరాలు, తర్లువాడ వద్ద 200 ఎకరాలు మాత్రమే కేటాయించగా తాజా నిర్ణయంతో భూమి పరిమాణంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టును మరింత వేగంగా అమలు చేయడానికి రైడెన్ ఇన్ఫోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు ప్రదేశాల భూములను అదానీ ఇన్ఫ్రా (ఇండియా) లిమిటెడ్ పేరుతో కేటాయించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇందుకు అనుగుణంగా మూడు ప్రాంతాల కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు కూడా సమర్పించింది. ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలకు అనుగుణంగా ప్రాజెక్టు అమలు చేయడానికి రైడెన్ ఇన్ఫోటెక్ మూడు ప్రత్యేక ప్రయోజన వాహనాలు ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఈ ఎస్పీవీల పేర్లతోనే ఏపీఐఐసీ భూమి కేటాయింపు లేఖలు జారీ చేయాలని, అలాగే వర్తించే ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ఆర్థిక ప్రయోజనాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అదానీ గ్రూప్ కోరింది. భూమి లావాదేవీలను తుది దశకు తీసుకెళ్లడం, అనుబంధ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక AI డేటా సెంటర్ క్యాంపస్‌ల అభివృద్ధి బాధ్యతలు అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్ట్స్ సంస్థలదేనని రైడెన్ ఇన్ఫోటెక్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
0 Comments