తెలంగాణ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు 'సిట్' అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి గురువారం వెళ్లి అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వయసు దృష్ట్యా పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని 'సిట్' పేర్కొంది. ఈ కేసులో ఇటీవల మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు మాజీ ఎంపీ సంతోష్‌రావును విచారించిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్‌నూ విచారించాలని 'సిట్' నిర్ణయించింది. రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'సిట్'ను పూర్తిగా ప్రక్షాళన చేసి సీపీ సజ్జనార్ నేతృత్వంలో మార్పులు చేర్పులు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన పోలీస్ అధికారులను విచారించి వారిని రిమాండ్‌కు తరలించారు. ఆ తరువాత ట్యాపింగ్‌లో బాధ్యులుగా ఉన్నవారిని విచారించి వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాగా, కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
'రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు : మాజీ మంత్రి హరీష్‌రావు
తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలను కొనసాగిస్తుందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని హరీష్ ట్వీట్ చేశారు.
0 Comments