Ad Code

ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోంది : చంద్రబాబు నాయుడు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోందని, ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు పండుగ వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. ప్రతి జిల్లాలో ఉత్సవాలు జరుగుతున్నాయని, కేరళలో పడవ పోటీలను తలపించేలా ఆత్రేయపురంలో పడవల పోటీలు, జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం అద్భుతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కడప జిల్లా గండికోటలో ఉత్సవాలు, సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నాయని తెలిపారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ పాలసీతో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో ప్రజల అవసరాలు తీర్చామని, 2026లో ఆకాంక్షలు నెరవేర్చాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌ మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా, అన్న క్యాంటీన్ వంటి పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. ధాన్యం సేకరణలో 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఈ ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రూ.10వేల కోట్లు చెల్లించామని సీఎం చంద్రబాబు వివరించారు. అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, ట్రూడౌన్ విధానంతో 13 పైసలు తగ్గించామని తెలిపారు. ఏడాదిలో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు నీళ్లిస్తామని చెబుతూ తాము ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని వెల్లడించారు. పార్టీ పరంగా పార్లమెంట్ స్థాయి వరకు పదవులు భర్తీ చేశామని, త్వరలో రాష్ట్ర కమిటీ నియామకం చేపడతామని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu