తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో శనివారం ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఫ్యాకల్టీ సభ్యులు దీపక్ జాన్ మాథ్యూ, ఆయన సహచరుడు కేతన్ చతుర్మత కలిసి రూపొందించిన సూపర్ ఎయిర్ ట్యాక్సీ భవిష్యత్తులో మన రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపబోతోంది. ఈ టాక్సీ గంటకు 60 నుండి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇది దాదాపు 120 కిలోల బరువును (పేలోడ్) సునాయాసంగా మోసుకెళ్లగలదు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థ. ముందుగా ప్రోగ్రామ్ చేసిన నావిగేషన్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రయాణికులు కూర్చుంటే చాలు, మాన్యువల్ సాయం లేకుండానే అది మనల్ని సురక్షితంగా గమ్యానికి చేరుస్తుంది. ఈ ఎయిర్ టాక్సీ కేవలం ఆఫీసులకు వెళ్లడానికే కాదు, అత్యవసర వైద్య సేవల్లోనూ విప్లవం తీసుకురానుంది. ముఖ్యంగా అవయవ మార్పిడి సమయంలో మానవ అవయవాలను ఒక ఆసుపత్రి నుండి మరో ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలో చేర్చడానికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. ట్రాఫిక్ వల్ల ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రాణాలు పోయే స్థితిలో, ఈ ఎయిర్ టాక్సీ ‘గ్రీన్ ఛానల్’ కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోటోటైప్ పరీక్షల దశలో ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతులు రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2026 లేదా 2027 నాటికి ఈ ఎయిర్ టాక్సీలు వాణిజ్యపరంగా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
0 Comments