Ad Code

నీటి పంపకాలలో తెలంగాణతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తాం !


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శనివారం మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు, పొరుగు రాష్ట్రాలతో సంబంధాలపై మాట్లాడుతూ రాష్ట్ర నీటి ప్రయోజనాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లే ఉంటుందని, దీనిని తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రిజర్వాయర్ ఎత్తు తగ్గిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూనే, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని సీఎం ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం వాటిల్లిందని, డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్ల పనులు సంక్లిష్టంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడంపై అంతర్జాతీయ నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందని చంద్రబాబు వెల్లడించారు. వారి నివేదిక ఆధారంగా తదుపరి పనులు చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవడమే కాకుండా, ఆర్థిక భారం కూడా పెరిగిందని విమర్శించారు. గోదావరి జలాలను రాయలసీమ, ఇతర కరువు ప్రాంతాలకు మళ్లించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్టు భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించబోమని, నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగవంతం చేస్తామని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తామని సీఎం తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసర వివాదాలకు పోకుండా, తెలుగు ప్రజలందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించవచ్చని, ఆ దిశగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నామని చెప్పారు. అమరావతి పనులు మళ్లీ ఊపందుకున్నాయని, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu