ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్ని కలుపుతూ మరో కొత్త రైలు పట్టాలెక్కబోతోంది. రాయలసీమలోని గుంతకల్లుతో మార్కాపురం జిల్లా మార్కాపురం రోడ్ స్టేషన్ ను కలుపుతూ ఈ రైలు ప్రయాణించించనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ మేరకు ఈ రైలు ప్రారంభానికి ఆమోద ముద్ర వేసినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు -మార్కాపూర్ రోడ్-గుంతకల్లు పాసింజర్ రైలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్తుంది. ఈ రైలు సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయని అధికారులు తెలిపారు. రైలు నం.57407/ 57408 గుంతకల్లు - మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ యొక్క ప్రతిపాదిత సమయాల్ని కూడా వెల్లడించారు. రైలు నం.57407 గుంతకల్లు నుంచి సాయంత్రం 5.30కు బయలుదేరే పాసింజర్ రైలు మార్కాపూర్ రోడ్ స్టేషన్ కు రాత్రి 11.30కు చేరుకోనుంది. ఇది మధ్యలో నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది. అలాగే రైలు నం.57408 మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కు బయలుదేరి సాయంత్రం 4.30కు గుంతకల్లుకు చేరుకోనుంది. ఈ రైళ్లు మార్గ మధ్యంలో మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం మరియు తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి. అలాగే ఈ కొత్త ప్యాసింజర్ రైలు సర్వీసు ప్రారంభం ద్వారా గుంతకల్లు, మార్కాపూర్ రోడ్ మధ్య ప్రయాణించే వారికి ప్రయోజనం కూరడమేకాకుండా మార్గ మధ్యంలోని నంద్యాల, గిద్దలూరు, కంభం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని అధికారులు తెలిపారు.
0 Comments