Ad Code

ఇంటర్‌ విద్యార్థి ప్రాణం తీసిన పైల్స్ సర్జరీ !


తెలంగాణ లోని మేడ్చల్‌ జిల్లా మల్లాపూర్‌లో పైల్స్‌ సర్జరీ వికటించడంతో 17 ఏళ్ల ఇంటర్‌ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి గత కొద్ది రోజులుగా పైల్స్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 11న హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్‌కు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడ సాహిల్, అతని భార్య బాలుడిని పరీక్షించి వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. దాదాపు రూ. 7,000 ల ఖర్చుతో ఈ ఆపరేషన్‌ చేయించారు. ఒక రోజంతా ఆస్పత్రిలోనే ఉన్న తరువాత మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ, మరుసటి రోజే ఆ బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే క్లినిక్ కు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులు ప్రతి రోజూ చికిత్స కోసం అతన్ని క్లినిక్ కు తీసుకెళ్తున్నారు. ఇది నవంబర్ 21 వరకు కొనసాగింది, ఆ తర్వాత బాలుడి పరిస్థితి మరింత దిగజారి జ్వరం, ఇతర సమస్యలు వచ్చాయి. క్లినిక్ వెంటనే అతన్ని చైతన్యపురిలోని మరో ఆసుపత్రికి రిఫర్ చేసింది. కానీ, అదే రోజు రాత్రి, అతన్ని మళ్ళీ మార్చి ఎల్బీ నగర్ లోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్టుగా బాలుడి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. నవంబర్ 22న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎల్బీ నగర్ ఆసుపత్రి వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అతన్ని వెంటనే మరేదైన పెద్ద ఆస్పత్రికి మార్చమని సూచించారు. దీంతో తల్లిదండ్రులు అతన్ని నీమ్స్‌కు తీసుకెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తు ఆస్పత్రికి చేరుకునే లోపుగానే బాలుడు మరణించినట్టుగా నీమ్స్‌ వైద్యులు ప్రకటించారు. అధిక రక్తస్రావం, సంబంధిత సమస్యలే బాలుడి మృతికి కారణమని డ్యూటీ వైద్యులు తెలిపారు.


Post a Comment

0 Comments

Close Menu