Ad Code

ఉన్నత పాఠశాలల్లో గంట సమయం పొడిగింపు !


ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. అకడమిక్‌ కేలండర్‌లో ఐచ్చికంగా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది. ఉన్నత పాఠశాలల పని వేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కాగా, దీన్ని 5 గంటల వరకు పెంచింది. ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు (హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌) పాఠశాలల్లో ఈ విధానం అమలుకు ఆదేశాలిచ్చింది. ఎంపిక చేసిన స్కూళ్లలో నవంబర్‌ 25 నుంచి 30 వరకు ఈ విధానంలో పాఠశాలలు నడపనున్నారు. సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని, మిగతా వెయిటేజీలో మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రయోగం అనంతరం ఈ నెల 30న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కి అభిప్రాయాలు నివేదించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక్కడి ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడుల్లో అమలు చేయనున్నారు. ఉన్నత పాఠశాలల పనివేళల మార్పు నిర్ణయంపై పునరాలోచించాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ, సీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు జమాల్‌రెడ్డి, ఏసీవీ గురువారెడ్డిలు ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో కోరారు. ఐదు కి.మీ. పరిధి నుంచి విద్యార్థులు వస్తున్నందున సాయంత్రం ఐదింటి వరకు బడిలో ఉంటే ఇళ్లకు చేరేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. వాతావరణం, ఇంటి సమస్యల దృష్ట్యా 'పొడిగింపు' నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments

Close Menu