Ad Code

తెలుగు వారి గురించి తప్పుగా మాట్లాడలేదు : మరోసారి కస్తూరి వివరణ


తెలుగు వారి గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటి కస్తూరి మరోసారి వివరణ ఇచ్చారు. నేటి సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడ స్థిరపడిన తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ 300 ఏళ్ల క్రితం అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారనడంతో దుమారం రేగింది. దీనిపై ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ తెలుగు వారిని అవమానించలేదన్న ఆమె తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. పలు మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ''ఇది ద్రవిడ సిద్ధాంత వాదులు చేసిన పని. నాకేం కొత్త కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా నాపై వ్యక్తిగతంగా ఎటాక్‌ చేస్తుంటారు. నా గురించి తప్పుడు వార్తలు రావడం తొలిసారి కాదు. డీఎంకే చెప్పే యాంటీ బ్రాహ్మిణ్‌ పాలసీ, యాంటీ హిందూ పాలసీ, యాంటీ సనాతన ఐడియాలజీకి వ్యతిరేకంగా మేం మాట్లాడడం వల్లే ఇదంతా జరిగింది. సాధారణంగా నేను సామాజిక వర్గం గురించి మాట్లాడను. నా సోదరుడు ఆదివారం నిర్వహించిన ఓ సభకు అన్ని వర్గాల వారు హాజరయ్యారు. నేను అక్కడ మాట్లాడిన దాన్ని కొందరు మరోలా అనువాదం చేశారు. ఓ నటిగా తెలుగు వారు నాకెంతో ఇచ్చారు. డీఎంకే పార్టీ ఎలా వ్యవహరిస్తుందో తెలుగు రాష్ట్రాల ప్రజలు అర్థం చేసుకోవచ్చు'' అని అన్నారు. పవన్‌ కల్యాణ్‌తో భేటీ కానున్నారనే వార్తలపై ప్రశ్నించగా అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్టు కస్తూరి తెలిపారు. ''తిరుమల లడ్డూ కల్తీ తదితర అంశాలపై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడినప్పుడు సోషల్‌ మీడియా వేదికగా నా మద్దతు తెలిపా. అప్పుడూ పలువురు నన్ను విమర్శించారు'' అని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu