Ad Code

మహాలక్ష్మితో విసిగిపోయాను - అందుకే చంపాను !


బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహాలక్ష్మీని చంపేసి 59 ముక్కలుగా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయేందుకు ముందు అతను సూసైడ్ నోట్‌ రాశాడు. దీంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ''సెప్టెంబర్ 03న  మహాలక్ష్మీని చంపాను'' అని లేఖలో పేర్కొన్నాడు. ఆమె ఇంటికి వెళ్లి హత్య చేసినట్లు చెప్పాడు. ''నేను ఆమె ప్రవర్తనతో విసిగిపోయాను. నేను ఆమెతో వ్యక్తిగత విషయాలపై గొడవపడగా, మహాలక్ష్మీ నాపై దాడి చేసింది. కోపంతో ఆమెను చంపాను''అని లేఖలో పేర్కొన్నాడు. ''మహాలక్ష్మీని చంపి, ఆమె శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో ఉంచాను. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి ఈ పని చేశాను' అని తన డైరీలో పేర్కొన్నాడు. ఒడిశా భద్రక్ జిల్లాకు చెందిన రాయ్ బుధవారం తన సొంతూరుకి సమీపంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయ్ బుధవారం పాండి గ్రామానికి వచ్చి, ఇంట్లోని స్కూటర్ తీసుకుని బయటకు వెళ్లాడు, ఆ తర్వాత ఉరేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. సంచనంగా మారిన ఈ కేసులో ముక్తి రంజన్‌ని పట్టుకునేందుకు నాలుగు పోలీస్ బృందాలు ఒడిశాకు వెళ్లాయి. అనుమానిత వ్యక్తి సెప్టెంబర్ 1 నుంచి పనికి రావడం మానేశాడు. మహాలక్ష్మీ కూడా సెప్టెంబర్ 1 నుంచి పనికిరావడం లేదు. సెప్టెంబర్ 2-3 మధ్య మహాలక్ష్మీ హత్య జరిగినట్లు తేలింది. మహాలక్ష్మీ పనిచేస్తున్న చోట టీమ్ లీడర్ గా నిందితుడు పనిచేస్తున్నాడు. మహాలక్ష్మీ, ముక్తి ఇద్దరూ ఓ గార్మెంట్ షాపులో పనిచేస్తున్నారు, ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. సెప్టెంబర్ 2న ఆమె వారాంతపు సెలవు తీసుకుంది. ఎప్పటిలాగే ముక్తి రంజన్ రాయ్ ఆమె నివాసానికి వచ్చాడు. మహాలక్ష్మీ తనను పెళ్లి చేసుకోమని ముక్తిని బలవంతం చేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇదే చివరకు ఆమె హత్యకు కారణమైంది. అప్పటికే పెళ్లయిన మహాలక్ష్మీకి భర్త, ఓ పాప కూడా ఉంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఓ ఫ్లాట్ లో ఉంటోంది. శనివారం బాధితురాలు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని మహాలక్ష్మీ తల్లి, సోదరికి ఫోన్ చేయడంతో, వారు ఇంటికి వచ్చి చూడటంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu