ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే డ్రైనేజీ వ్యవస్థల పరిశుభ్రత, ఇతర సంబంధిత విషయాల గురించి కాన్పూర్ నగర్ నిగమ్ సమావేశానికి హాజరయ్యారు. డ్రెయిన్ క్లీనింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు. జోన్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నానక్ చంద్ మార్చి నెలకు సంబంధించిన రిపోర్ట్ అందించగా మేయర్ కోపంతో ఫైలు విసిరారు. ఈసారి కాలువలు శుభ్రం చేయకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ అధికారి మార్చి నెలకు సంబంధించిన రిపోర్ట్ జూన్ నెలదని చూపడంతో మేయర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అధికారులు పని చేస్తున్న తీరు చూస్తే తొంభై శాతం పనులు జరిగినట్లు కనిపించడం లేదని తెలిపారు. ఆరోగ్య, ఇంజినీరింగ్ శాఖలదే బాధ్యత కాబట్టి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రెండు నెలల క్రితమే డ్రైన్ క్లీనింగ్‌కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కాలువలు శుభ్రం లేవన్నారు. ఆక్రమణలను తొలగించే వరకు సరైన శుభ్రత సాధించలేమని ఆమె తెలిపారు. మరోవైపు స్థల పరిశీలనకు ఇంజనీర్లు గైర్హాజరు కావడం గమనార్హం. దీంతో మేయర్ పాండే మునిసిపల్ హెడ్ క్వార్టర్స్‌లో మొత్తం ఆరు జోన్ల ఇంజనీర్లతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇంజనీర్లు ఎవరూ డ్రెయిన్ తనిఖీకి సంబంధించిన ఫోటోను చూపించలేదు. దీంతో ఆమెకు చిర్రెత్తిపోయి సహనం కోల్పోయింది.
0 Comments