ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి దాదాపుగా స్వస్తి పలికాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండగా టీసీఎస్ మాత్రం ఉద్యోగులందరూ ఆఫీస్‌లకు రావాల్సిందేనని తేల్చిచెప్పేసింది. దీంతో ఉద్యోగులు ఇప్పుడిప్పుడే ఆఫీల బాట పడుతున్నారు. అయితే ఉద్యోగులందరూ కార్యాలయాలకు వస్తుండటంతో మరో సమస్య ఎదురైంది. టీసీఎస్ రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ఓ వైపు ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఆఫీస్‌కు వెళ్తున్న ఉద్యోగులకు మరో కొత్త సమస్య వచ్చింది. ఉద్యోగులందరూ ఆఫీస్ నుంచి పనిచేసేందుకు రావడంతో వారికి తగినన్ని సీట్లు అందుబాటులో లేవు. దీంతో వారికి కేటాయించిన సీట్లపై గందరగోళం నెలకొంది. గత రెండేళ్లలో టీసీఎస్ లక్ష మంది ఉద్యోగులను చేర్చుకుంది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. దీంతో సీట్ల కొరత ఏర్పడింది. అకేషనల్ ఆక్యుపేషన్ జోన్‌లు అని పిలిచే ఉద్యోగుల తాత్కాలిక సీటింగ్ సౌకర్యాలను కంపెనీ తొలగించడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఉద్యోగులందరికీ తగినన్ని సీట్లు లభించగా కొందరు ఆఫీస్ కారిడార్లు, లాబీల్లో కూర్చొని పని చేసుకుంటున్నారు. అయితే రోజంతా ఇలా పనిచేయడానికి చాలా అసౌకర్యంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనం ప్రచురించింది. వారంలో ఐదు రోజులూ కార్యాలయానికి తిరిగి రావాల్సిందేనని టీసీఎస్ ఉద్యోగులను అభ్యర్థిస్తోంది. కొన్ని బృందాలకు వర్క్ ఫ్రం హోమ్ ముగిసింది. ఉద్యోగులు తమకు కేటాయించిన కార్యాలయాలకే రావాలని, తమ ఇళ్లకు దగ్గరగా ఉండే ఆఫీస్‌లు కావాలంటే కుదరదని చెప్పడం గందరగోళానికి తోడైంది. రిటర్న్-టు-ఆఫీస్ మార్పును క్రమబద్ధీకరించడానికి, ఉద్యోగులందరికీ సాఫీగా ఉండేలా చేయడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని టీసీఎస్ హెచ్‌ఆర్ అధికారులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని ఆఫీస్‌లు ఇరుగ్గా ఉండటం, మరికొన్నింటిలో తగినన్ని సౌకర్యాలు లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులు ఎక్కడైతే నియమితులయ్యారో అదే ఆఫీస్ నుంచి పని చేయాలని, లేకుంటే వారికిచ్చే సిటీ అలవెన్స్ కోల్పోవాల్సి ఉంటుందని తమ టీం మేనేజర్లు తెలియజేసినట్లు కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. టైర్-1 నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ. 2,000-3,000 సిటీ అలవెన్స్ లభిస్తుంది. కానీ తమ సౌకర్యం కోసం కొందరు ఉద్యోగులు ఈ అలవెన్స్‌ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
0 Comments