Ad Code

ఓయూ కేంద్రంగా ఎన్నో అంకుర సంస్థలు ఆవిర్భవించాలి !

ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న గ్లోబల్ అలుమ్నీ మీట్ సందర్భంగా డాక్టర్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ప్రస్తుతం పరివర్తన చెందుతోందన్నారు. ఓయూ కేంద్రంగా ఎన్నో అంకుర సంస్థలు ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ సహా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పు తీసుకొచ్చాయని వివరించారు. ఈ ఫలితంగానే దేశీయ పరిజ్ఞానంతో ఆయుధాలు, యుద్ద విమానాల తయారీ చేపట్టగలిగామని స్పష్టం చేశారు. ఐఐటీలు సహా ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన 75% మంది మేధావులు గతంలో విదేశాలకు వలసవెళ్లేవారని.. ప్రస్తుతం 75% మంది తిరిగి భారత్ వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే 2017లో 461 అంకుర సంస్థలు ఆవిర్భవించగా.. 2022 నాటికి 75వేల అంకుర సంస్థలు ఏర్పడ్డాయని వెల్లడించారు. ఉస్మానియాతో తనకున్న 35 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సతీష్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు ఉస్మానియా పూరోభివృద్ధికి వెన్నెముకగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావు మాట్లాడుతూ కంటెంట్ కన్నా ఆలోచనలు ముఖ్యమైనవని.. ఈ విషయంలో ఉస్మానియా వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావు చెప్పారు. అధ్యాపకులు భవిష్యత్తు సవాళ్లపై దృష్టి సారించాలన్న ప్రొఫెసర్ బీజే రావు.. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. పరిమిత వనరుల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా పనిచేయాలని.. ఇందులో భారత్ ప్రపంచ యవనికపై పోటీ పడుతోందని చెప్పారు. పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో భారత్ పురోగమిస్తోందని వివరించారు. హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా ఇతర సంస్థలతో పోల్చుకోకుండా ఉస్మానియా ఉస్మానియా విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందాలని... ప్రపంచవిశ్వవిద్యాలయాలకు ఓయూ ఏ మాత్రం తీసిపోదని టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని మెటాస్టాసిస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రఘు కల్లూరి అన్నారు. భవిష్యత్తు అంతా భారత్‌దే అన్నారు. ఈయన ఆత్మ విశ్వాసంతో అనుకున్నది సాధించాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ నాయకత్వం వహిస్తుందని వివరించారు. ఏ దశకు చేరుకున్నా తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థను మరిచిపోవద్దని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu