కొండా సురేఖ బర్తరఫ్ స్వయంకృతాపరాధమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ, ప్రభుత్వం కొండా సురేఖకు అనేక అవకాశాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. కొండా సురేఖ తన కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోలేకపోయారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పదేపదే విమర్శలు చేయడం ద్వారా పార్టీ, ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేశారని అన్నారు. కుటుంబ సభ్యులు సీఎం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సమయంలో వారించడంలోనూ సురేఖ విఫలమయ్యారని పేర్కొన్నారు. కొండా సురేఖ వ్యవహారశైలిపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖపై కోపం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అధిష్ఠానాన్ని సీఎం బ్లాక్‌మెయిల్ చేశారంటూ సురేఖ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. కొండా సురేఖ కుటుంబ సభ్యులు గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి సంయమనంతో వ్యవహరించారని ఆది శ్రీనివాస్ చెప్పారు. ఇప్పుడు కూడా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినా సీఎం ఎక్కడా బయటపడలేదని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై గౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే చర్యలకు ఎందుకు పాల్పడ్డారని కొండా సురేఖను ప్రశ్నించారు. కొండా సురేఖతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిని కూడా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారని ఆది శ్రీనివాస్ గుర్తుచేశారు. చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతో ఇష్టమైన నాయకుడని చెప్పారు. గతంలో ఆయనకు మద్దతుగా రేవంత్ రెడ్డి గోడలపై రాతలు రాసి ప్రచారం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, పార్టీ, ప్రభుత్వాన్ని బలహీనపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసిందని ఆది శ్రీనివాస్ తెలిపారు.
0 Comments