జపాన్లోని ఆసియా గేమ్స్ ఆతిథ్య నగరమైన నాగోయాను భారీ రికార్డు స్థాయి వర్షాలు ముంచెత్తడంతో వందలాది మంది ఆసియా క్రీడల అథ్లెట్లను వారి వసతి గృహాల నుండి తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నాగోయాలో కేవలం ఒక్క గంటలోనే దాదాపు 104 మిమీ వర్షపాతం నమోదు కావడంతో నగరంలోని కొన్ని ప్రాంతాలకు మున్సిపల్ అధికారులు ఖాళీ చేయాలని (ఎవాక్యుయేషన్) హెచ్చరికలు జారీ చేశారు. పోటీలు గురువారం ప్రారంభం కానుండగా, కొన్ని క్రీడా వేదికలలోకి వర్షపు నీరు లీక్ అయింది. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులే జపాన్ మరియు ఇతర ప్రాంతాలలో ఇలాంటి తీవ్రమైన వర్షపాతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆసియా క్రీడలకు ప్రత్యేకంగా 'అథ్లెట్స్ విలేజ్' ఏదీ నిర్మించలేదు. దానికి బదులుగా నిర్వాహకులు క్రూయిజ్ షిప్, తాత్కాలిక చెక్క కంటైనర్లు మరియు హోటళ్లపై ఆధారపడ్డారు.చెక్క కంటైనర్ గుడారాలు ఉన్న నగరంలోని గార్డెన్ పియర్ ప్రాంతంలో బస చేసిన "వందలాది" అథ్లెట్లను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించినట్లు నాగోయా పోర్ట్ అథారిటీ అధికారి ఒకరు తెలిపారు. సుమారు రెండు గంటల తర్వాత ఎవాక్యుయేషన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో అథ్లెట్లు తిరిగి తమ నివాసాలకు చేరుకున్నారు. నగరంలో విస్తృతంగా వరదలు వచ్చినప్పటికీ అథ్లెట్లకు ఎలాంటి హాని జరగలేదని మేయర్ ఇచిరో హిరోసావా తెలిపారు.వేదికల పరిస్థితుల గురించి మేము ఆందోళన చెందడం లేదు, ప్రణాళిక ప్రకారమే ఆసియా క్రీడలను నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని మేము నమ్ముతున్నాము అని బుధవారం ఆయన విలేకరులతో అన్నారు. ఆసియా క్రీడల కోసం తాత్కాలిక నివాస గృహాలుగా మార్చిన షిప్పింగ్ కంటైనర్లలో బస చేసిన దాదాపు 400 మంది అథ్లెట్లు మరియు సిబ్బందిని భారీ వర్షం సమయంలో కొద్దిసేపు ఎత్తైన ప్రాంతాలకు తరలించినట్లు హిరోసావా చెప్పారు.క్రీడా వేదికల పైకప్పుల నుండి అక్కడక్కడ నీరు లీక్ అవడం మినహా అంతకుమించి తీవ్రమైన నష్టమేమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.ఆసియా క్రీడలు అధికారికంగా సెప్టెంబర్ 19న ప్రారంభోత్సవంతో మొదలవుతాయి, అయితే బాస్కెట్బాల్ వంటి కొన్ని రకాల పోటీలు గురువారం నుంచే ప్రారంభమవుతాయి. కొన్ని వేదికలలో వర్షపు నీరు చొరబడినప్పటికీ, ఆ సౌకర్యాలకు తీవ్రమైన విఘాతం కలగలేదని మరియు షెడ్యూల్ ప్రకారమే పోటీలు జరుగుతాయని మేయర్ హిరోసావా తెలిపారు.కొన్ని భవనాల పైకప్పుల నుండి వర్షపు నీరు లీక్ కావడం వంటి స్వల్ప ప్రభావం ఉంది. కానీ సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఈ క్రీడలకు ఎలాంటి ప్రమాదం కలిగించేంత తీవ్రమైన పరిస్థితి ఐతే లేదు అన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఆసియా క్రీడల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నాను.
ఆసియా గేమ్స్ ఆతిథ్య నగరమైన నాగోయాను ముంచెత్తిన భారీ వర్షాలు : సురక్షిత ప్రాంతాలకు అథ్లెట్ల తరలింపు
September 09, 2026
0
Tags