ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వెళ్లాల్సిన 92 మంది సిక్కు యాత్రికులను అడ్డుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం
భారత్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణం అవ్వాల్సిన సుమారు 92 మంది సిక్కు యాత్రికుల బృందాన్ని పాకిస్థాన్ అధికారులు ఫైసలాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదనే సాకును చూపుతూ వారి ప్రయాణాన్ని నిలిపివేసారు. దీంతో విమానాశ్రయంలోనే చిక్కుకుపోయిన సిక్కు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షార్జా మీదుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ యాత్రికుల ప్రధాన ప్రణాళిక. శ్రీ హర్మందిర్ సాహిబ్‌లో జరిగే శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాష్ పురబ్ వేడుకలతో పాటు హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర, ఢిల్లీలోని పలు చారిత్రక గురుద్వారాలను దర్శించుకోవడానికి వీరు ప్రయాణం కావాల్సి ఉంది. ఎయిర్‌పోర్టులోనే తమను నిలిపివేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాత్రికులు పాక్ ప్రభుత్వాన్ని నిలదీశారు. "మమ్మల్ని ఈ విధంగా వ్యవహరించడానికి మేమేమైనా తీవ్రవాదులమా?" అని ఆవేదనతో ప్రశ్నించారు. పాకిస్థానీ సిక్కు యాత్రికులకు ఎదురవుతున్న ఈ సవాళ్లకు సరిహద్దుల్లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలే కారణంగా తెలుస్తోంది. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అట్టారీ-వాఘా భూ సరిహద్దు మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. సాధారణంగా రెండు దేశాల మధ్య సిక్కు యాత్రికులకు సరిహద్దులు దాటి పవిత్ర స్థలాలను సందర్శించే వెసులుబాటు ఉండేది. అయితే సరిహద్దు మూసివేతతో ఈ విధానానికి తీవ్ర విఘాతం కలిగింది. గత ఏడాది నవంబర్‌లో భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సంఘటన తర్వాత, గురునానక్ దేవ్ 556వ జయంతి (ప్రకాష్ పుర్బ్) వేడుకల కోసం అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా దాదాపు 2,000 మంది భారతీయ సిక్కు యాత్రికులు పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో పాకిస్థాన్ అధికారులు సిక్కు యాత్రికులను గురుద్వారా జన్మస్థాన్ సందర్శనకు అనుమతించినప్పటికీ.. హిందూ యాత్రికులను మాత్రం వెనక్కి పంపారు. మే నెలలో జరిగిన నాలుగు రోజుల ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి పర్యటన అదే కావడం గమనార్హం. ప్రస్తుతం మాత్రం పాక్ అధికారులు తమ దేశ సిక్కులకే ప్రయాణ అనుమతులు నిరాకరిస్తూ కఠినంగా వ్యవహరించడం చర్చనీయాంశం అయింది.
Comments
Post a Comment