Ad Code

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే దిశలో ప్రభుత్వం : కిలో ఉల్లి రూ.35, 350 ఔట్‌లెట్లలో బియ్యం సరఫరా

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ధరల తగ్గింపు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నిత్యావసర ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించిన విషయం తెలిసిందే. ధరల పెరుగుదలకు కొన్ని కారణాలతో పాటు స్వార్థపరుల చర్యలు, యుద్ధ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం కూడా కారణమయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందుగా ఉల్లిపాయల సరఫరాపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడితో సమన్వయం చేసుకుని కిలో ఉల్లిని రూ.35కే సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పామాయిల్ ధరలను కూడా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్కెట్ ధరతో పోలిస్తే లీటరుకు సుమారు రూ.10 తక్కువగా పామాయిల్ అందించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 350 ఔట్‌లెట్లలో బియ్యం సరఫరాపై దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే బియ్యం కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బియ్యం సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిత్యావసర సరుకుల్లో కీలకమైన కందిపప్పు ధరపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అయితే, ధరల నియంత్రణ, ధరల తగ్గింపుపై నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు త్వరలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu