యూరప్, ఐస్‌ల్యాండ్‌లలో అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతం అయింది. దాదాపు 27 ఏళ్ల కాలం తర్వాత యూరప్‌లో కనిపించిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు యూరప్ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఒకే చోటుకు చేరారు. ఒకవైపు ప్రజలు ఈ అద్భుతాన్ని కళ్లారా తిలకిస్తుంటే, మరోవైపు సైంటిస్టులు అంతరిక్షంలో నింగి నుంచే గ్రహణ రహస్యాలను తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్పెయిన్ దేశానికి ఏకంగా 60 లక్షల మందికి పైగా పర్యాటకులు తరలివచ్చారు. దేశంలోని ఉత్తర ప్రాంతాలు, బలేరిక్ ఐలాండ్స్ మీదుగా మార్గం ఉండటంతో ఆయా ప్రాంతాలన్నీ జనసందోహంతో నిండిపోయాయి. అయితే అదే సమయంలో స్పెయిన్‌లో తీవ్ర వేడిగాలులు వీస్తూ ఉండటంతో, అడవుల్లో కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. స్పెయిన్ లో సూర్యాస్తమయ సమయానికి ముందే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటంతో ప్రజలు ఈ అరుదైన గ్రహణాన్ని కనులారా వీక్షించారు. ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్యావిక్‌లోనూ ఈ అద్భుతాన్ని చూసేందుకు దాదాపు 80 వేల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. కేవలం 4 లక్షల మంది జనాభా ఉన్న ఈ చిన్న దేశానికి ఇది చాలా పెద్ద సంఖ్య. ఐస్‌ల్యాండ్ పశ్చిమ తీరంలో చంద్రుని నీడ ఆకాశాన్ని కాసేపు చీకటిమయం చేసింది. ఈ సూర్యగ్రహణ సమయంలో ప్రముఖ సింగర్ 'బ్జోర్క్' రేక్యావిక్ దక్షిణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లో డీజే ప్రదర్శనతో అలరించారు. భూమిపై నుంచి ప్రజలు ఆకాశం వైపు ఆసక్తిగా చూస్తుండగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మాత్రం ఆకాశంలోనే చంద్రుని నీడను వెంటాడేందుకు ఓ ప్రత్యేక పరిశోధనా విమానాన్ని రంగంంలోకి దించింది. నాసాకు చెందిన ప్రత్యేకమైన డబ్ల్యూబీ-57 రీసెర్చ్ ఎయిర్‌క్రాఫ్ట్ దాదాపు 50,000 అడుగుల ఎత్తులో గంటకు 460 మైళ్ల వేగంతో గ్రహణ మార్గంలో ప్రయాణించింది. సాధారణంగా మేఘాలు, వాతావరణ నీటి ఆవిరి వల్ల భూమి నుంచి సూర్యుడిని సరిగ్గా చూడటం కష్టమవుతుంది. కానీ నాసా డబ్ల్యూబీ-5 విమానం మేఘాలకు చాలా ఎత్తులో ఎగరగలదు. దీని వల్ల సైంటిస్టులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడి బాహ్య వాతావరణం అయిన 'కరోనా'ను సుదీర్ఘ సమయం పాటు స్పష్టంగా అధ్యయనం చేసే అరుదైన అవకాశం లభించింది.
0 Comments