Ad Code

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల మధ్య మరోసారి జల వివాదం రాజుకుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఏపీ అధికారులు సాగర్ కుడి కాలువ ద్వారా సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతంలోని తాగునీటి అవసరాల కోసమే నీటిని తీసుకుంటున్నామని ఏపీ అధికారులు చెబుతుండగా, బోర్డు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో కుడి కాలువకు నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని ప్రాజెక్ట్ నిర్వహణ పర్యవేక్షిస్తున్న తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఏపీ అధికారులను కోరారు. అయితే, తెలంగాణ అధికారుల అభ్యంతరాలను ఏపీ ఇంజనీరింగ్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఏపీ ఏకపక్షంగా నీటిని తోడేస్తున్నప్పుడు తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేస్తూ, పోటాపోటీగా సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నింపడంతో పాటు తమ పరిధిలోని తాగునీటి అవసరాల నిమిత్తం ఎడమ కాలువ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. బోర్డు అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలు కాలువలకు నీటిని విడుదల చేసుకునే పరిస్థితి తలెత్తడంపై ప్రాజెక్టు వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాజెక్టు నీటి మట్టాలు, నిల్వల లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా నీటిని తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తరలించిన వ్యవహారాన్ని కృష్ణా బోర్డు దృష్టికి అధికారికంగా తీసుకెళ్లేందుకు రెండు రాష్ట్రాల అధికారులు సిద్ధమవుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu