ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ పదవికి మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి కూటమి పార్టీల నుంచి ఎలాంటి నామినేషన్ దాఖలు కాకపోవడంతో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయమైంది. మాధవరావు నిన్న ఉదయం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. శాసనమండలిలో సంఖ్యాబలం తమకు అనుకూలంగా లేకపోవడం, గెలుపుపై స్పష్టత లేకపోవడంతోనే కూటమి పక్షాలు పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు శాసనమండలి సమావేశంలో డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు పేరును మండలి చైర్మన్ మోషన్ రాజు అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం సభా కార్యక్రమాల ప్రకారం ఆయన ఎన్నికను ప్రకటించే అవకాశం ఉంది. పోటీ లేకపోవడంతో మాధవరావు ఎన్నిక లాంఛనప్రాయంగానే పూర్తికానుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మొత్తం 58 స్థానాలు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీల్లోకి మారారు. అయినప్పటికీ, డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ చేసి విజయం సాధించే స్థాయిలో కూటమి పార్టీలకు అవసరమైన సంఖ్యాబలం లేదనే రాజకీయ అంచనాలు ఉన్నాయి. టీడీపీకి 10 మంది ఎమ్మెల్సీలు, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఒకరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఐదుగురు ఇండిపెండెంట్ సభ్యులు ఉండగా, మరో ఏడు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్సీలను పరిగణనలోకి తీసుకున్నా డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేంత సంఖ్యాబలం కూటమి పక్షాలకు లేకపోవడం ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణంగా మారింది. మరోవైపు, వైసీపీ నుంచి మాధవరావు నామినేషన్ వేయడం, ఆయనకు ప్రత్యర్థిగా ఎవరూ రంగంలోకి దిగకపోవడంతో మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఆ పార్టీ ఖాతాలోనే కొనసాగనుంది. ఇప్పటికే మండలిలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది.
0 Comments