దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ఠానికి చేరింది. జులై నెలలో 3.54 శాతంగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం దిగువకు చేరడం ఇదే తొలిసారి. ఆహార పదార్థాల ధరలు తగ్గడమే దీనికి కారణం. ఈ మేరకు సోమవారం కేంద్ర గణాంక కార్యాలయం డేటాను వెలువరించింది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్ నెలలో 5.08 శాతంగా నమోదు కాగా.. గతేడాది జులైలో 7.44 శాతంగా ఉంది. చివరిసారిగా 2019 సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 4 శాతం దిగువన ముగిసింది. జూన్‌లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 9.36 శాతంగా ఉండగా.. జులై నాటికి 5.42 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణ సూచీని ఆహార పదార్థాల ధరలే సగానికి పైగా ప్రభావితం చేస్తుంటాయి. ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ ఆహార పదార్థాల ధరల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో వాటి ధరలు తగ్గుముఖం పట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక కూరగాయల ధరలు సైతం 29.32 శాతం నుంచి 6.83 శాతానికి తగ్గినట్లు గణాంక కార్యాలయం పేర్కొంది. గడిచిన కొన్ని నెలలుగా కీలక వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరిన వేళ.. ఈ డేటా వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ఆధారంగానే వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుంది.
0 Comments