భారత్, మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉన్న టెంగ్నౌపాల్ జిల్లా, మోరే నగరంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముస్లిం బస్తీలో పది ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటలు, పొగలు దట్టంగా వ్యాపించాయి. మంటలు మరింతగా వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మయన్మార్ అగ్నిమాపక సిబ్బంది సరిహద్దులు దాటి వచ్చి మంటలు ఆర్పేందుకు సహకరించారు. కాగా మణిపూర్ రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, కమాండోలు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు మరింతగా వ్యాపించడాన్ని మయన్మార్ అగ్నిమాపక దళం సిబ్బంది గమనించారు. అగ్నిమాపక వాహనాలతో అంతర్జాతీయ సరిహద్దు దాటి మోరే చేరుకున్నారు. దగ్ధమవుతున్న ఇళ్ల మంటలను అదుపు చేసేందుకు సహకరించారు. మయన్మార్ అగ్నిమాపక సిబ్బంది సహకారాన్ని మణిపూర్ పోలీస్ అధికారి కొనియాడారు. ఆ దేశ ఫైర్ బృందాలు సకాలంలో చేరుకోకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని అన్నారు. ఇలా ఆకస్మికంగా సరిహద్దులు దాటి సహకరించడం అరుదైన సంఘటన అని పేర్కొన్నారు. అగ్ని ప్రమాద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. ఈ భారీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
0 Comments