Ad Code

పోస్టింగ్ లేకుండా సీతారామాంజనేయులు రిలీవ్ : ఈ నెల 31న అధికారికంగా సర్వీసుల నుంచి రిలీవ్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసి, ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వయోపరిమితి ప్రకారం ఉద్యోగ విరమణ తేదీ సమీపించడంతో ఈ నెల 31న ఆయనను అధికారికంగా సర్వీసు నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సస్పెన్షన్ వేటు అమల్లో ఉన్నప్పటికీ, సహజ సర్వీస్ కాలపరిమితి ముగుస్తుండటంతో అధికారికంగా ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించేందుకు సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు సిద్ధం చేసింది. ఉద్యోగ విరమణ చేసినంత మాత్రాన ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణల నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ముంబై నటి కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్టు, వేధింపుల కేసుతో పాటు ఏపీపీఎస్సీ అక్రమాలు సహా పలు అధికార దుర్వినియోగం ఆరోపణలపై నమోదైన క్రిమినల్ కేసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. రిటైర్మెంట్ అనేది కొనసాగుతున్న దర్యాప్తులకు, న్యాయపరమైన విచారణలకు ఏమాత్రం అడ్డంకి కాదని ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా పేర్కొంది. ఆయనకు అందాల్సిన పెన్షన్, ఇతర సర్వీస్ ప్రయోజనాలపై కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరించనుంది. సర్వీస్ నిబంధనల ప్రకారం పెండింగ్‌లో ఉన్న క్రిమినల్, శాఖాపరమైన కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, పూర్తిస్థాయి తుది పెన్షన్ చెల్లింపుల కంటే నిబంధనల మేరకు తాత్కాలిక పెన్షన్ మాత్రమే వర్తింపజేసే అవకాశం ఉంది. విచారణలు పూర్తయి తుది తీర్పులు వెలువడే వరకు పూర్తి స్థాయి గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్‌పై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మొత్తం వ్యవహారంలో చట్టపరమైన, శాఖాపరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేసులు, కోర్టు వ్యవహారాలు, విచారణ కమిటీల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని డీజీపీ కార్యాలయానికి స్పష్టం చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu