రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, రష్యా వినియోగిస్తున్న S8000 బాండెరోల్ క్రూయిజ్ క్షిపణి టర్నింగ్ పాయింగ్‌గా మారింది. ఈ మిస్సైల్ దాడి ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి పెద్ద సవాల్‌గా మారింది. అత్యంత వేగం, చిన్న పరిమాణం, మోడ్రన్ యాంటీ-జామింగ్ సాంకేతికత కలిగిన ఈ క్షిపణిని అడ్డుకోవడం ఉక్రెయిన్ వల్ల కావడం లేదు. క్రూయిజ్ క్షిపణి, ఆత్మాహుతి డ్రోన్‌ల కలయిక S8000ను ప్రాణాంతకంగా మార్చింది. ఇదే సమయంలో రష్యా భారీ సంఖ్యలో డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించడంతో ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా దాడులు తీవ్రత పెరుగుతోంది. బాండెరోల్ క్షిపణిని కూల్చివేయడంలో అతిపెద్ద సవాలు దాని వేగం, ఇంజిన్. ఉక్రెయిన్ రక్షణ నిపుణుల ప్రకారం, ఈ క్షిపణి గంటకు 520 నుండి 560 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 650 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఉక్రేనియన్ సైన్యం తరచుగా క్షిపణులు, డ్రోన్‌లను అడ్డగించడానికి మొబైల్ ఫైర్ టీమ్‌లను ఉపయోగిస్తుంది. అలాగే నేలపై మోహరించిన భారీ మెషిన్ గన్‌లతో రష్యా డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేస్తుంది. కానీ బాండెరోల్ మిస్సైల్ విషయానికి వస్తే, దాని ఇంజన్ వేగం ఉక్రెయిన్ భద్రతా వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి సహకరిస్తుంది. మెషిన్ గన్ టీమ్‌లు దీని ముందు పనిచేయకుండా పోతాయి. దీనిని ఆపాలంటే అత్యంత వేగంగా కదిలే లక్ష్యాలను పసిగట్టగలిగే ''గెపార్డ్'' వంటి ఆటోమేటిక్, అత్యాధునిక వ్యవస్థలు అవసరం. సాంప్రదయా క్రూయిజ్ మిస్సైల్‌తో పోలిస్తే S8000 పరిమాణం చిన్నగా ఉంటుంది. ఇది సుమారుగా 5 మీటర్ల పొడవు, 2.2 మీటర్ల రెక్కల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఇది రాడార్‌కు చిక్కకుండా టార్గెట్లపై దాడి చేస్తుంది. గాల్లోనే దిశను వేగంగా మార్చుకునే సత్తా దీని సొంతం. దీంతో దీని మార్గాన్ని గుర్తించి కూల్చేయడం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు కష్టమవుతుంది. రష్యాపై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ క్షిపణిలో 30కి పైగా విదేశీ కంపెనీలకు చెందిన 40కి పైగా భాగాలు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. చైనాకు చెందిన SW800Pro జెట్ ఇంజిన్, జపాన్‌కు చెందిన మురాటా బ్యారటీలు, దక్షిణ కొరియాకు చెందిన డైమిక్సెల్ సర్వో మోటార్లు, అమెరికా, స్విట్జర్లాండ్‌లకు చెందిన మైక్రోకంట్రోలర్లు, వోల్టేజ్ రెగ్యులేటర్లను రష్యా ఈ క్షిపణిలో వాడింది. రష్యా ఈ విడి భాగాలను నేరుగా కొనుగోలు చేయకుండా ఆర్మేనియా, కజకిస్తాన్, చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాల్లోని మధ్యవర్తులు, షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
0 Comments